మోడీజీ దాడుల నుండి రక్షించండి
ప్రధానమంత్రికి మాజీ సీఎం జగన్ లేఖ
అమరావతి – వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చాక పనిగట్టుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మాజీ సీఎం సుదీర్ఘ లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.
ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వాపోయారు. ఏపీలో ప్రస్తుతం బతికే పరిస్థితులు లేకుండా పోయాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నానని తెలిపారు.
రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలి పోయాయని పేర్కొన్నారు. యంత్రాంగం నిస్తేజంగా మారి పోయిందని , ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైర విహారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారు. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. అమానవీయ, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇందుకు వినుకొండ సంఘటన సభ్య సమాజం తల దించుకునేలా చేసిందని, వెంటనే కూటమి సర్కార్ ను కంట్రోల్ లో ఉంచాల్సిందిగా కోరారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.