ఫేక్ ప్రచారానికి అంబాసిడర్ జగన్

Share it with your family & friends

మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఓట‌మిని త‌ట్టుకోలేక కూట‌మిపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను త‌మ పార్టీకి ఆపాదించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి డోలా వీరాంజ‌నేయ స్వామి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చు కోవ‌డం లేదంటూ ఎద్దేవా చేశారు.

సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ టిడిపిపై తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ ది అంటూ ఫైర్ అయ్యారు. వినుకొండలో జరిగిన హత్యకు ముఖ్య కారకుడు జగనేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వైసీపీ హయాంలో హతుడు రషీద్ నిందితుడు జిలానీ మధ్య జరిగిన గొడవలపై నాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ హత్య జరిగేదా అని ప్ర‌శ్నించారు. నాడు జగన్ చేసిన పాపానికి మూల్యం ఒక వ్యక్తి నిండు ప్రాణం బ‌లై పోయింద‌న్నారు.

జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ప్రజలే జగన్ ని శాశ్వతంగా రాజకీయాలు మానిపిస్తారని హెచ్చ‌రించారు.