గ్రూప్-2 పరీక్ష వాయిదా పరిశీలిస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – నిరుద్యోగులు గత కొంత కాలంగా చేస్తున్న ఆందోళనలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లు బేగంపేట లోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షలు వెంట వెంటనే నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని వాపోయారు. దీనిపై స్పందించారు ఎంపీ, ఎమ్మెల్సీలు. ఇది కావాలని చేసింది కాదని, తాము సర్కార్ తో మాట్లాడి సానుకూలంగా స్పందించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు వారి ప్రయత్నం ఫలించింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో గ్రూప్-2 అభ్యర్థులు సమావేశం అయ్యారు. ప్రజా భవన్ లో జరిగిన ఈ కీలక భేటీలో పలు సూచనలు చేశారు.
అభ్యర్థుల ఆవేదనను విన్న భట్టి విక్రమార్క గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తామని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ తో దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిసెంబర్ చివరి వారంలో పరీక్ష నిర్వహించేందుకు గాను సాధ్య సాధ్యాలపై అధికారులతో మాట్లాడతామన్నారు.