DEVOTIONAL

21న‌ పెద్ద జీయ‌ర్ స్వామి చాతుర్మాస దీక్ష

Share it with your family & friends

వైదిక ధర్మంలో దీక్ష‌ల‌కు అధిక ప్రాధాన్య‌త‌

తిరుమల – తిరుమల పుణ్య క్షేత్రంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా జ‌ర‌గ‌నుంది. జూలై 21న ఆదివారం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించ‌నున్నారు. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఏర్పాట్లు చేసింది.

ఇదిలా ఉండ‌గా హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.

ఈ నేపథ్యంలో రామానుజాచార్యుల వారి వంశ పారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్ద జీయర్ తిరుమల బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుండి చిన్న జీయర్, శిష్య బృందంతో క‌లిసి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని ద‌ర్శించుకుంటారు.

స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టీటీడీ ఈఓ జె. శ్యాంమ‌ల రావు, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాద పూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు. జీయ‌ర్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ కు మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ‌శ్రీ‌శ్రీ‌ చిన్నజీయర్ కు నూలు చాటు వస్త్రాన్ని బహూకరిస్తారు.