పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలి
కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేయాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాద్ – విజయవాడ వయా మిర్యాలగూడ వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి లేఖ రాశారు.
పర్మిషన్ ఇస్తే రూ. 2,300 కోట్లు రిలీజ్ అవుతాయని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు ఛాన్స్ ఇవ్వాలని సీఎం కోరారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్ఐడీ) మంజూరు చేసిందని ప్రస్తుతం విజయవాడకు తరలించారని తెలిపారు. దీంతో తెలంగాణకు ఎన్ఐడీ ఇవ్వాలని సూచించారు.
కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, ఒకవేళ మీరు మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు. ఇది మంచి ప్రతిపాదన అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులకు సూచించారు.
పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చిందని, దానికి గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. బ్రౌన్‌ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్‌కు మార్చితే పార్క్‌కు గ్రాంట్ల రూపంలో అదనంగా రూ.300 కోట్ల నిధులు వస్తాయని, ఇది అక్కడి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (IIHT) మంజూరు చేయాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కార్ కు సహకరిస్తామని కేంద్ర మంత్రి గోయల్ హామీ ఇచ్చారు.