రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం
ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది. సింగరేణి సంస్థ సహకారంతో సివిల్స్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించ బోతున్నామని చెప్పారు.
ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమాన్ని సీఎంగా లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. సింగరేణి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సివిల్స్‌లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్‌కు ఎంపికైన యువతీ యువకులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.