23న బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న కేంద్రం
ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లతో కీలక సమావేశం
న్యూఢిల్లీ – ముచ్చటగా మూడోసారి కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చరిత్ర సృష్టించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఇందు కోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు విత్త మంత్రి. పన్నుల మోత ఉంటుందా అన్న అనుమానం అంతటా వ్యక్తం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామంటూ ప్రకటించారు. కానీ ఇప్పటి దాకా కనీసం 50 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. కేవలం పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా బడ్జెట్ ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి.
గతంలో పూర్తి మెజారిటీ కలిగి ఉన్న బీజేపీకి ఈసారి ఆశించిన మేర సీట్లను చేజిక్కించు కోలేక పోయింది. ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ బడ్జెట్ ను ఈనెల 23న ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లతో కీలక సమావేశం కానున్నారు. ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.