NEWSANDHRA PRADESH

ఎంపీల‌కు సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశం

Share it with your family & friends

నిధులు, ప‌థ‌కాలు సాధించేలా ఫోక‌స్ పెట్టండి

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు దూకుడు పెంచారు. ఈనెల 23 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోడీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ముచ్చ‌ట‌గా మూడోసారి బ‌డ్జెట్ 2024 ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప‌థ‌కాల గురించి ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం.

ఈ మేర‌కు ఏపీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కీల‌క భేటీకి నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త వ‌హించారు. ఎంపీల‌తో పాటు ఈ మీటింగ్ కు రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాలు సాధించడంలో ఎంపిలు కీలకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం లోని ఆయా శాఖల వ్యవహారాలపై కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను ఎంపిలకు అప్పగించారు ఏపీ సీఎం.