వైఎస్సార్సీపీ మాఫీయా పార్టీ
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అమరావతి – కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. వైఎస్సార్సీపీని పార్టీనే కాదంటూ పేర్కొన్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే మాఫీయా పార్టీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటూ ఐదేళ్ల పాటు రాక్షస పాలన సాగించారని ఆరోపించారు.
రాచరిక పాలనను కొనసాగించడం వల్లనే ప్రజలు ఛీ కొట్టారని, చివరకు 11 సీట్లకే పరిమితం చేశారంటూ మండిపడ్డారు రామ్మోహన్ నాయుడు. అయినా జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి బుద్ది రావడం లేదన్నారు.
ఇదే సమయంలో కొందరు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ విషయంలో దుష్ప్రచారం చేయడం తగదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని , దానిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదన్నారు రామ్మోహన్ నాయుడు.