యూపీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ఖర్గే మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనా కాలంలో అవినీతి, అక్రమాలు పెరిగి పోయాయని ఆరోపించారు. ఎక్కడ చూసినా స్కామ్ లే దర్శనం ఇస్తున్నాయని వాపోయారు.
ప్రధానంగా తమ కాలంలో రాజ్యాంగ వ్యవస్థలను బలంగా ఉంచితే మోడీ వచ్చాక వాటిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అన్నింటిని కాషాయీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఖర్గే.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీ , ఆర్ఎస్ఎస్ పద్దతి ప్రకారంగా భారత రాజ్యాంగ వ్యవస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకోవడంలో మునిగి తేలుతున్నాయంటూ వాపోయారు ఖర్గే. దీని కారణంగా వాటి ప్రతిష్ట, సమగ్రత, స్వయం ప్రతిపత్తి దెబ్బ తింటోందన్నారు.
దొంగ సర్టిఫికెట్లతో సివిల్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిపై వేటు వేయాలని కోరారు. యూపీఎస్సీ చైర్ పర్సన్ మనోజ్ సోనీ రాజీనామా చేసినా ఆయన కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. రేయింబవళ్లు కష్టపడి చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు.
చైర్ పర్సన్ తన పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఐదేళ్లు ఉన్నా అకారణంగా రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అనేక కుంభకోణాలకు ఆయన రాజీనామాకు ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.