ఓం గురుభ్యోనమః
దేశమంతటా గురు పౌర్ణిమ
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా గురు పౌర్ణిమను జరుపుకుంటున్నారు. అసలు గురు పూర్ణిమ అంటే ఏమిటి..దీనిని ప్రతి ఏటా ఎందుకు జరుపుకుంటారనేది ప్రతి ఒక్కరికీ కలిగే ప్రశ్న. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండడంతో దీనిని ఈ నెలకు ఆషాఢ మాసమని పేర్కొంటున్నారు జ్యోతిష పండితులు.
ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా పిలుస్తూ వస్తున్నారు. వేద వ్యాసుడు ఇవాళ పుట్టడంతో ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణిమ పేరు వచ్చిందని పేర్కొంటున్నారు. విష్ణువు రామచంద్ర మూర్తిగా అవతరించిన సమయంలో వశిష్టుడిని గురువుగా స్వీకరించారు. తన సందేశాన్ని వినిపించారు.
శ్రీ కృష్ణుడు సాందీప మహర్షిని తన గురువుగా స్వీకరించాడు. తను నేర్చుకున్న ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను లోకానికి పంచాడు. మొత్తంగా ప్రపంచంలో గురువుకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుడిగా భావిస్తారు .
విద్యను అందించడం, విలువలు నేర్పించడం, బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చి దిద్దడంలో గురువులు కీలక పాత్ర పోషిస్తారు. ఇవాళ అత్యున్నతమైన స్థానాలలో ఉన్న వారు, విజేతలంతా ఏదో ఒకరోజు గురువులకు శిష్యులుగా ఉన్న వారే.
తమ ఉన్నతికి సహకరించిన, తోడ్పాటు అందించిన గురువులను స్మరించు కోవడం, వారికి నమస్కరించడం , సత్కరించడం గురు పౌర్ణిమ రోజు జరుగుతుంది.