ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి
భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలు
అమరావతి – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయు గుండం అల్ప పీడనంగా మారడంతో ఏపీలో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక చేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్.
ఇదిలా ఉండగా వరద ఉధృతి అంతకంతకూ పెరగడంతో గోదావరి, కృష్ణా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ 14 గేట్ల ద్వారా10,150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.
కాలువల ద్వారా మరో 1,309క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది. 7,96,686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కాలువలు, చెరవులు, కుంటలు , నదులు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల వర్షాల ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.