తప్పుకున్న బైడన్..అధ్యక్ష రేసులో హారిస్
అనారోగ్య కారణాల రీత్యా పోటీ నుండి విరమణ
అమెరికా – అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రస్తుతం జరగబోయే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే తన పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు అధ్యక్షుడిగా కొనసాగుతానని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తన వారసులు ఎవరు అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించారు జోసెఫ్ బైడెన్. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన కమలా హారీస్ ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా తమ పార్టీ తరపున ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు యుఎస్ చీఫ్.
తను చేసిన కీలక ప్రకటనలో దేశ ప్రయోజనాల కోసమే పోటీ నుంచి విరమించు కుంటున్నట్లు వెల్లడించారు. కొంత కాలం నుంచి తాను అనారోగ్యంతో బాధ పడుతున్నానని, పూర్తి కాలం దేశానికి అధ్యక్షుడిగా సేవలు అందించలేక పోతున్నానని తెలిపారు జోసెఫ్ బైడెన్.
అపారమైన అనుభవం, ప్రజల పట్ల ప్రేమ, సేవ చేయాలనే తపనతో పాటు నిబద్దత కలిగిన రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన కమలా హారీస్ ను అధ్యక్ష పదవికి సిఫారసు చేయడం జరిగిందని స్పష్టం చేశారు జోసెఫ్ బైడెన్.