మూసీ ప్రక్షాళన చేస్తామంటే బాధ ఎందుకు
మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ప్రశ్న
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా పలు ప్రశ్నలు సంధించింది కేటీఆర్ కు.
మూసీ ప్రక్షాళన చేస్తామంటే నీకెందుకు బాధవుతోందని పేర్కొంది. మూసీ కలుషితంతో ప్రజల ఆరోగ్యం పై పడుతోన్న ప్రభావం ఎంత అనేది సోయి ఉందా అంటూ మండి పడింది. ఆ ప్రభావం వల్ల రోగాల బారిన పడి వైద్యానికి ప్రజలు ప్రతి ఏటా తెలియకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విషయం తెలుసా అని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ.
మూసీ నది కింద రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టు ఉన్న విషయం అమెరికాలో “ఆ పని” చేసొచ్చిన నీకు తెలవక పోవడంలో ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేసింది. మూసీ సుందరీకరణ తో హైదరాబాద్ కు పెరిగే బ్రాండ్ ఇమేజ్ విలువ నువ్వు అంచనా కట్టగలవా అని మండిపడింది.
పర్యాటకం పెరగడం వల్ల ఆదాయం వస్తుందన్న విషయం నీకు తెలుసా , అది తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించింది కాంగ్రెస్ పార్టీ. దాని పరీవాహకంలో కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుందని నీకు తెలియక పోవడం దారుణమని పేర్కొంది.
నీ దృష్టిలో అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు కట్టే అద్దాల మేడలేనా అంటూ మండిపడింది.