NEWSANDHRA PRADESH

వైసీపీని చూసి కూట‌మి భ‌య‌ప‌డుతోంది

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. త‌మ‌ను చూసి కూట‌మి స‌ర్కార్ భ‌య‌ప‌డుతోంద‌ని అన్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన అనంత‌రం మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు.

కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయ‌ని, ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మండిప‌డ్డారు . అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని ఎద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశ పెట్టలేక పోతోందని ఎద్దేవా చేశారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్ అక్కౌంట్‌ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందని అన్నారు జ‌గ‌న్ రెడ్డి.

ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిప‌డ్డారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేలా రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి.