ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ
హాజరైన మల్లు భట్టి విక్రమార్క..ఉత్తమ్
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. అంతకు ముందు పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణాలను రైతులకు సంబంధించి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ ఉన్నారు.
ఈ సందర్బంగా వరంగల్ లో రైతుల రుణ మాఫీకి సంబంధించి విజయోత్సవ సభను నిర్వహించాలని అనుకున్నట్లు ప్రియాంక గాంధీకి తెలిపారు. ఆమె సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే పనిలో పడిందన్నారు. ఇప్పటి వరకు రుణ మాఫీలో భాగంగా తొలి విడతలో 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు .