సర్కార్ నిర్వాకం రైతులు ఆగమాగం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
అప్పులు చేసి సాగు చేసిన రైతుల పాలిట వర్షాలు శాపంగా మారాయని పేర్కొన్నారు. ఇప్పటికే గత సర్కార్ నిర్వాకం కారణంగా చితికి పోయారని మండిపడ్డారు. వ్యవసాయాన్ని పక్కన పెట్టారని, రైతులను పట్టించు కోలేదని ఆరోపించారు. గతంలో దివంగత సీఎం వైఎస్సార్ రైతులకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
తన తండ్రి తలపెట్టిన జల యజ్ఞాన్ని కొడుకు మాజీ సీఎం జగన్ రెడ్డి తన హయాంలో పూర్తిగా పక్కన పెట్టాడని , అందువల్ల ఇవాళ ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రాజెక్టులు కట్టక పోగా ఉన్న వాటిని ఎత్తేశాడని మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అప్పు చేయని రైతంటూ లేడన్నారు. ధరల స్థిరీకరణ అనేది మోసం అన్నారు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయని వాపోయారు. అన్నీ కోల్పోయిన రైతులను కూటమి సర్కార్ ఆదుకోవాలని కోరారు వైఎస్ షర్మిల.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీ రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. మోసాలకు కేరాఫ్ అయిన బీజేపీతో చంద్రబాబు జత కట్టడం దారుణమన్నారు. దీని వల్ల నష్టమే తప్ప ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని, పంటలు కోల్పోయిన వాటిని అంచనా వేయాలని కోరారు షర్మిల.