NEWSTELANGANA

మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు స‌హ‌క‌రించండి

Share it with your family & friends

కేంద్ర మంత్రిని కోరిన ఎనుముల రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ – దేశ రాజ‌ధానిలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విడుద‌ల చేయాల‌ని కోరారు. మ‌రో వైపు కొత్త ప్రాజెక్టుల‌కు సంబంధించి స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు. ఆయ‌న వెంట డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

తాజాగా కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రిని క‌లుసుకున్నారు సీఎం . మూసీ రివ‌ర్స్ ఫ్రంట్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్టుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. కాలుష్య బారిన పడి మురికి కూపంగా త‌యారైన‌ మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింద‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా త‌యారు చేసిన‌ బృహత్తర ప్రణాళిక గురించి కేంద్ర మంత్రికి వివరించారు.

రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లను నింపే పనుల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని వివరించారు. జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019 లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వ లేదని గుర్తు చేశారు. ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందు కోసం పీఎంఏవై (అర్బన్ అండ్ రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు.