రాష్ట్రాభివృద్దిపై దృష్టి సారించాలి
రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించాలి
అమరావతి – ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఇలా చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ప్రధానంగా కీలకమైన బీఏసీ సమావేశానికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కాక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం తప్ప మరోటి కాదన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారని అన్నారు.
సభ్యులు ఎవరైనా సరే, మంత్రులైనా సరే సభ్యతా , సంస్కారాన్ని కలిగి ఉండాలని, వైసీపీ నేతలు రెచ్చ గొట్టినా సంయమనం పాటించాలని సూచించారు ఏపీ సీఎం. మన దృష్టి లక్ష్యం వైపు ఉండాలని, ఆ టార్గెట్ ఒక్కటే ఏపీని అన్ని రంగాలలో ముందంజలోకి తీసుకు వెళ్లడమేనని మరోసారి స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యుల సమావేశం జరిగింది. ఈ కీలక భేటీకి ఏపీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు.