ఆ ఘటన పెద్దిరెడ్డి పనే – అనగాని
ఏపీ మంత్రి సంచలన కామెంట్స్
అమరావతి – ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ గా అనిపిస్తోందంటూ సాక్షాత్తూ డీజీపీ తిరుమల రావు చెప్పారని అన్నారు మంత్రి.
ఈ ఘటన వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందన్న అనుమానం తనకు కలుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సత్య ప్రసాద్. ఈ అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పారు. మంత్రి మీడియాతో మట్లాడారు.
ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్, ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేశామని, అన్ని రెవిన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
పెద్దిరెడ్డి అవినీతి కప్పిపుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చు. పెద్దిరెడ్డి రూ.వెయ్యి కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చాకే ఘటన జరిగిందన్నారు. మొన్నటి వరకు సబ్ కలెక్టరేట్ ఆయన నియంత్రణలోనే ఉందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా భారీగా ల్యాండ్ కన్వర్షన్ జరిగిందన్నారు. దీనిపై ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించగానే ఘటన చోటు చేసుకుందన్నారు. ఆదివారం ఉద్యోగులు ఎక్కడైనా పని చేస్తారా అంటూ ప్రశ్‌నించారు.