DEVOTIONAL

శ్రీ కోదండ‌రాముడి ప‌విత్రోత్స‌వాలు

Share it with your family & friends

జూలై 31 నుండి ఆగ‌స్టు 2వ తేదీ దాకా

తిరుప‌తి – తిరుపతిలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్ర‌మైన‌ శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 31 నుండి ఆగ‌స్టు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 30న సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయ‌ని వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ).

వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధి వాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు . గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తార‌ని తెలిపింది టీటీడీ.