అమిత్ షాతో విజయ సాయి రెడ్డి భేటీ
పలు అంశాలపై చర్చించామన్న ఎంపీ
న్యూఢిల్లీ – వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని తన ఛాంబర్ లో కలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించడం జరిగిందని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీయే ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేశారు జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కూటమి వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఈ సందర్బంగా జూలై 24న బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని , తమను రక్షించాలని కోరారు ఎంపీ విజయ సాయి రెడ్డి.