ఇది బడ్జెట్ కాదు ఎన్నికల మేనిఫెస్టో
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రం మంగళవారం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2024పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశానికి దిశా నిర్దేశం చేసి అభివృద్దికి దోహదపడే బడ్జెట్ కాదన్నారు. ఇది కేవలం తమ కుర్చీలను కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంటూ మండిపడ్డారు. వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.
ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ ను తలపించేలా ఉందన్నారు. ఏది పడితే అది చెప్పొచ్చు, ఏదైనా హామీ ఇవ్వొచ్చని అన్నారు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. కాల పరిమితి ఉండాలి కానీ ఇవేవీ లేవన్నారు .ఏపీకి చంద్రబాబు లక్ష కోట్లు కావాలని కోరితే కేవలం రూ. 15,000 కోట్లు మాత్రమే ఇస్తామనడం దారుణమన్నారు వైఎస్ షర్మిల.
5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో ఆయనకు అర్థం కాక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం పై కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అన్నారు..ఫుడ్ సేఫ్టీ అంటూ ఊదరగొట్టారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.
హామీలు ఇస్తే సరిపోతుందా..ఎంతిస్తారో చెప్పకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. కబుర్లు తప్ప అంకెలు ఏవీ లేవంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు. విభజన హక్కులను గౌరవిస్తామన్న మీరు మాట మార్చడం, మాటైనా ఎత్తక పోవడం దారుణమన్నారు. తిరుపతిలో మోడీ ఇచ్చిన మాట తప్పినట్టేనా అని ఎద్దేవా చేశారు.