కాళేశ్వరం అవినీతిమయం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 సీట్లకు గాను 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారాయని ఆరోపించారు.
గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులే లాభ పడ్డారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతమయంగా మారిందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు. సాగు నీటిని మరింత విస్తరిస్తామని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు పెంచుతామని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్బంగా తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించామన్నారు.
రైతు బంధు కింద ఇప్పటి వరకు 60 శాతం పూర్తి చేశామన్నారు. ఇంకా నాలుగు గ్యారెంటీలను అమలు చేసే పనిలో ఉన్నామని, తాము వచ్చి కేవలం నెల రోజులు మాత్రమే అయ్యిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.