పోయేటోళ్లను పట్టించుకోవద్దు
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడిపోతున్న వాళ్ల గురించి పట్టించు కోవద్దన్నారు. వారున్నా లేకున్నా ఒరిగేది ఏమీ లేదన్నారు. ఒక్కొక్కరికి పదవులు కట్టబెట్టామని, వారికి ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు కేసీఆర్. వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకున్నారంటూ పేర్కొన్నారు.
పార్టీలో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేక పోయారని అన్నారు కేసీఆర్. పార్టీ ఫిరాయించిన వారిపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోందని, వారికి బిగ్ షాక్ తప్పదని హెచ్చరించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పని చేయాల్సిన వాళ్లు ఉన్నట్టుండి పార్టీని వీడితే ఏమని అనుకోవాలని అన్నారు కేసీఆర్.
వేలాది మందిని నాయకులుగా తయారు చేశానని, తనకు పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం పెద్ద పని కాదన్నారు. రాదని అనుకున్న తెలంగాణను సాధించి తీసుకు వచ్చిన ఘనత తనదేనని అన్నారు. చివరి దాకా ఉండే వాళ్లే నిజమైన నాయకులని అన్నారు. ఇవాళ కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానని , దీనిపై ఎక్కువగా ఫోకస్ పెడతానని చెప్పారు.
పోయేటోళ్ల గురించి పట్టించు కోవద్దని, వారి గురించి అస్సలు ఆలోచించ వద్దని సూచించారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ పై ఇక నుంచి పోరాటమే ఉంటుందని స్పష్టం చేశారు కేసీఆర్.