కావాలనే కవితను జైలులో పెట్టారు
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ సీఎం
హైదరాబాద్ – తన కూతురు కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యం లాంటిదని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. తనపై ఉన్న కోపంతో, కక్ష సాధింపుతో జైల్లో పెట్టారని, వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా, దమ్ము తనకు ఉందని స్పష్టం చేశారు.
రాజకీయంగా తనను ధైర్యంగా ఎదుర్కొలేకనే ఇలా తన కూతురును చెరసాలపాలు చేశారంటూ వాపోయారు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుందన్నారు కేసీఆర్.
ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కామెంట్స్ చేశారు. తాను ఏనాడూ కేంద్రానికి తల వంచ లేదని, అందుకే తనపై కక్ష కట్టారంటూ మండిపడ్డారు. ఎవరు ఏమిటి అనేది ప్రజలకు తెలుసన్నారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎలా గడ్డి పెట్టారో చూశారని ఎద్దేవా చేశారు.
సంఖ్యలపై తనకు నమ్మకం లేదని, తాను తెలంగాణ సాధించిన ఏకైక నాయకుడినని అందుకే తనకు తన మీద నమ్మకం ఎక్కువ అని చెప్పారు కేసీఆర్. తన కూతురు తప్పకుండా త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తుందని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు ఎన్నడూ చెల్లుబాటు కావని తెలుసు కోవాలని అన్నారు.