ఒంగోలు ఎంపీగా పోటీ చేయను
మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు – టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు కొనసాగనున్నాయి. దీంతో వైవీఎస్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
పార్టీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పలుమార్లు సమావేశం కావడం జరిగిందన్నారు. అయితే ఒంగోలు లోక్ సభ స్థానానికి సంబంధించి ఎంపీగా పోటీ చేయనని పలు మార్లు జగన్ రెడ్డికి చెప్పానని స్పష్టం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.
అందుకే ప్రస్తుతం పార్టీ పనులు చూస్తున్నానని తెలిపారు. అయితే పోటీ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకునేది పార్టీ బాస్ జగన్ రెడ్డేనని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఇక బరిలో ఉండాలా వద్దా అన్న దానిపై చివరగా నిర్ణయం తీసుకునేది ఆయనేనని అన్నారు. దీని విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు వైవీ సుబ్బారెడ్డి.
జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు వారి వ్యక్తిగత కారణాలు వారికి ఉన్నాయని , సీట్ల మార్పు విషయంలో సీఎం స్పష్టంగా ఉన్నారని చెప్పారు. ఆఖరుగా ట్రాక్ రికార్డును బట్టి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఖరారవుతాయని స్పష్టం చేశారు.