NEWSANDHRA PRADESH

ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ ఫెయిల్

Share it with your family & friends

శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది

న్యూఢిల్లీ – ఏపీలో కొన‌సాగుతున్న వ‌రుస దాడుల‌ను నిర‌సిస్తూ వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీలో చేప‌ట్టిన ఆందోళ‌న‌కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది శివ‌సేన పార్టీ. ఆ పార్టీకి చెందిన జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ తో పాటు మ‌రో ఎంపీ ప్రియాంక చౌద‌రి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఏపీలో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదాలో ఉన్న వైసీపీ ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అక్క‌డి స‌ర్కార్ పై మండిప‌డ్డారు ఎంపీ ప్రియాంక చౌద‌రి. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ అన్న‌ది లేకుండా చేశార‌ని , లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు.

ఇవాళ జ‌గ‌న్ రెడ్డి చేస్తున్న పోరాటం న్యాయ బ‌ద్ద‌మైన‌దేన‌ని పేర్కొన్నారు. అందుకే త‌మ పార్టీ ఆయ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ని చెప్పారు ప్రియాంక చౌద‌రి. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి సీఎంగా ఉన్నార‌ని, ఇవాళ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కొన‌సాగుతున్నార‌ని రేపొద్దున తిరిగి ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు.

రాజ‌కీయాల‌లో ఇది స‌ర్వ సాధార‌ణ‌మ‌ని, కానీ అధికారంలోకి వ‌చ్చి నెల రోజులైనా కాక ముందే ఇలా ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను చంప‌డం దారుణ‌మ‌న్నారు.