శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంపు
కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవు
తిరుమల – తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టిటిడి ఈవో జె. శ్యామలరావు చెప్పారు. అదే విధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు.
ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్ మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులోఎన్ డిఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొ.స్వర్ణ లత, బెంగుళూరుకు చెందిన డా.మహదేవన్ ఉన్నారన్నారు.
ఈ కమిటీ వారం రోజులలో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశా నిర్ధేశం చేస్తుందన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని సూచించామన్నారు. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారని తెలిపారు, మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయని తమ విచారణలో తేలిందన్ఆనరు. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్ లో తేలిందన్నారు.
టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు పంపినట్లు తెలిపారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరి పోలడం లేదని , కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు.
టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు.