అన్న ప్రసాదంపై భక్తులతో ఈవో ఆరా
వెంగమాంబ కాంప్లెక్స్ ఆకస్మిక తనిఖీ
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు దూకుడు పెంచారు. వరుస తనిఖీలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గాడి తప్పిన టీటీడీ వ్యవస్థను కంట్రోల్ లోకి తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.
తాజాగా భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, సలహాల మేరకు ఈవో రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా జె. శ్యామలా రావు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేశారు. టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా, కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు.
అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత చేతులు కడుగుకునే కుళాయిలు కొన్ని పని చేయడం లేదని, వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కళ్యాణ కట్టను సందర్శించారు ఈవో జె. శ్యామలా రావు. ఈ సందర్భంగా కళ్యాణ కట్టలోని అత్యంత పాత గీజర్లు, పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అలాగే విరిగిన నీటి కొళాయిలు, పని చేయని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.