నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. తాజాగా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో కనీసం తెలంగాణ పేరు కూడా లేక పోవడాన్ని, నిధులు కేటాయించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.
ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సైతం కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించారు. ఇందులో భాగంగా ఈనెల 27న ఢిల్లీలో నిర్వహించే అన్ని రాష్ట్రాలు పాల్గొనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం ఎనుముల రవేంత్ రెడ్డి. తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించిందని, హక్కులకు భంగం కలిగించేలా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకుండా కక్ష పూరితంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు ఎనుముల రేవంత్ రెడ్డి.
బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాల్సిందిగా ఈ తీర్మానం ద్వారా డిమాండ్ చేయడం జరిగిందన్నారు.