బానిసత్వాన్ని వీడితినే బతుకగలం
ప్రముఖ దర్శకుడు పా రంజిత్
తమిళనాడు – ప్రముఖ దర్శకుడు పా రంజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ , దివంగత ఆర్మ్ స్ట్రాంగ్ ను స్మరిస్తూ నివాళిగా చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ సమాజంలో మనుషులకు కులం ద్వారానే గుర్తింపు ఉంటుంది. మన దేశంలో కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి వరకు.. కోహిమా నుంచి కచ్ వరకు.. దళిత జాతి ప్రజలు విస్తరించి ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం దళితుల జనాభా దేశ జనాభాలో సుమారు 22 శాతం. అంటే అందరికంటే మెజారిటీ ప్రజలు దళితులే.
మరి ఎన్నికల ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో మెజారిటీ ప్రజలదే అధికారం ఉండాలి. కానీ ఏం జరుగుతోంది..? ఒకప్పుడు చదువుకుంటే నాలుకలు కోసిన బ్రాహ్మణులతో సమానంగా, రిజర్వేషన్ ఉపయోగించుకుని చదువుకున్న అత్యధిక విద్యావంతులు ఈ దళిత ప్రజలే.. అయినా ఎందుకు ఈ రాజకీయ వెనుకబాటు. మైనారిటీ అంటే సంఖ్య కాదు.. ప్రజలకున్న హక్కులు, అధికారం స్థాయిని బట్టి సమాజంలో మైనారిటీ స్థాయి నిర్ణయించబడాలి అన్న బాబాసాహేబ్ అంబేద్కర్ మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అంబేద్కర్ తన కుటుంబాన్ని, భవిష్యత్తును, జీవితాన్ని త్యాగం చేసి దళిత జాతి ప్రజలకు రాజకీయ హక్కులు సాధించి పెట్టారు. ఓటు హక్కుతో పాటుగా, చట్ట సభల్లో దళిత, గిరిజన ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు “రాజకీయ రిజర్వేషన్”లు కల్పించారు. ఆ చట్టసభల్లో రిజర్వేషన్ ద్వారా కల్పంచిన ప్రాతినిధ్యంతో అధికారంలో భాగస్వాములై, తరాల వెనుకబాటుతనాన్ని పోగొట్టుకుని ఆత్మ గౌరవంతో, తలెత్తుకుని బ్రతికే అవకాశం ఉన్నా.. ఎందుకు అది నెరవేరడం లేదని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
రిజర్వేషన్ ద్వారా వచ్చిన విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సమాజంలో “సౌకర్యాలను” పొందే సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నారే కానీ… ఆశించిన ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని మాత్రం పొందడం లేదు.. ఎందుకని? ఎందుకంటే.. మనమంతా ఒక్కటిగా లేము… ముఖ్యంగా “రాజకీయంగా” ఒక్కటిగా లేము. రాజకీయంగా ఒక “ఉమ్మడి లక్ష్యం” లేదు. గతం నుంచి నేర్చిన గుణపాఠాలు వ్యక్తిగతంగా ఉన్నంత బలంగా… “ఒక జాతి”గా మనకు లేదు. మంచి బట్టలు, మంచి చదువు, మంచి జీవితం ఉంటే చాలు.. ఓర్వలేని తనంతో… “మీరు మాతో పాటు సమానమా” అని చంపడానికి కూడా వెనుకాడని, అలా ఉన్నందుకు చంపేందుకు వీళ్లు “అర్హులే” అన్న విధంగా ఈ సమాజం ఉంది అంటే కారణం మనలోని అనైక్యతనే.
తెల్లవారుజామున రోడ్లు ఊడ్చే ఒక స్త్రీని మనకు సంభందం లేనిదని మనం అనుకుంటాం కానీ… మనం ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా… ఆ రోడ్డు ఊడిచే స్త్రీది, మనది “ఒకే కులం” అనే ఆలోచనతో ఈ సమాజం చూస్తుంది. కానీ ఆ కష్టజీవిని మాత్రం “మన” అని మనం అనుకోము. అలాంటి మన ఆలోచనలే మనల్ని ఒక్కటిగా ఉండ నీయడం లేదు. ఆ రోడ్లు ఊడ్చే స్త్రీ లాంటి ప్రజలు వేసిన ఓట్లతోనే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్లి, మేము మీ వాళ్ళమే, మీ పిల్లలమే, మీ సోదరులమే అని చెప్పి… మాలాగా మీరు కూడా మారాలి అంటే.. మనమంతా ఒక్కటిగా ఉండి ఆ రాజకీయాన్ని మన చేతిలోకి తెచ్చుకోవాలన్న స్ఫూర్తి వాళ్లకి కలిగిస్తే… ఎందుకు మన రాజ్యం రాదు?
మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు మనం చూశాం. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. పదుల సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్న అగ్రవర్ణ రాజకీయ పార్టీల నేతలు చక్రం తిప్పారు. కానీ అదే లోకసభలో ఉన్న 84 ఎస్సీ సీట్లు, 47 ఎస్టీ సీట్లు.. ఆ వర్గాల ప్రజలకు ప్రాతినిద్యం వహించే పార్టీల చేతుల్లో ఉంటే… అలా రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అదే వర్గాల ప్రజల కోసం పనిచేస్తే… అధికారంలో భాగస్వాములై.. మన ప్రజల జీవితాలను బాగు చేసుకోమా? ఆ అధికారంతో ఆత్మగౌరవాన్ని సాధించుకోమా? హత్యలు, అత్యాచారాలు, పరువు హత్యలు, ఆత్మహత్యలు, అవమానాలు, ఆకలి చావుల నుంచి మన ప్రజలను రక్షించుకోమా?
ఇటీవల చెన్నై నగరం నడిబొడ్డున BSP రాష్ట్ర అధ్యక్షుడు “ఆర్మ్ స్ట్రాంగ్” అన్నను నరికి చంపితే… పేరుమోసిన రాజకీయ పార్టీలలో, పెద్ద పదువుల్లో ఉన్న రాజకీయ నాయకులు నోరు మెదపని పరిస్థితి నెలకొంది. రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడుతామని వాగ్దానం చేసి.. బహుజన ప్రజలు, ముఖ్యంగా “దళిత ప్రజల ఓట్ల”తో తమ ఆస్తిత్వాన్ని నిలబెట్టుకున్న పార్టీ నాయకులు… ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్లేందుకు మాట్లాడుతారు? వాళ్లకి కేవలం మన ఓట్లు కావాలి అంతే.. అ పార్టీలలోని మన దళిత ప్రజాప్రతినిధుల పరిస్థితి అయితే బానిస బ్రతుకులకన్నా హీనం. అదిగో ఆ పరిస్థితిని “గుండె ధైర్యంతో” ప్రశ్నించాడు… దర్శకుడు పా. రంజిత్.
అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ తో, దళిత ప్రజల ఓట్లతో ఎన్నికైన దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి జాతి ప్రజల తరపున మాట్లాడకపోతే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి అనే దమ్మున్న ప్రకటన చేశాడు. ఆర్మ్ స్ట్రాంగ్ అన్న హత్య విషయంలో మాకు న్యాయం జరగకపోతే.. చెన్నై నగరంలో దళిత జాతి ప్రజలు 40 శాతం మందిమి ఉన్నాం “గుర్తుపెట్టుకోండి” అని పాలకవర్గాలకు గట్టి హెచ్చరిక పంపారు. ఇన్నాళ్లు దళిత వాడలను, దళిత ప్రజల్ని కేవలం “ఓటు బ్యాంకు”గా చూసే రాజకియ పార్టీలకు ఒళ్ళు జలదరించే హెచ్చరిక ఇది. ఒక్కసారి ఆలోచించండి.. మనం ఈ సమాజంలో “సురక్షితంగా లేము”.. వాళ్లకి అణిగిమణిగి ఉన్నంతవరకు మనం మంచివాళ్ళం .
ఎపుడైతే మనం వాళ్ళతో సమానమని అంటామో అప్పుడు మనం రౌడీలం అవుతాం, అర్బన్ నక్సలైట్లం అవుతాం, దేశ ద్రోహులం అవుతాం.. సులభంగా “మన వ్యక్తిత్వాన్ని” హత్య చేస్తారు… ఇది మన పని ప్రదేశాల్లో జరిగే సాధారణ విషయం.. ఇది మనందరికీ తెలిసిందే…వాళ్ల అధికారాన్ని ప్రశ్నించాడు కాబట్టే ఆర్మస్ట్రాంగ్ అన్నని… కులం కత్తికి బలి తీసుకున్నారు. అందుకే మనం ఒక్కటిగా ఉండాలి… వేరే వాడిని అనే ముందు.. మన కోసం మాట్లాడాల్సిన మన ప్రజా ప్రతినిధులు, అగ్రవర్ణ రాజకీయ పార్టీల్లో బానిసలుగా ఉన్న మన ప్రజా ప్రతినిధులకు బుద్ది చెప్పాలి.
మనం ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా “రాజకీయ గొంతుని” వినిపించాలి. లేదంటే ఇపుడు కనిపించని బానిసలుగా ఉన్న మనం.. మన భావితరాలను, సూటు, బూటు వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడే “బానిసలుగా” మారుస్తాం. చివరగా ఒక్కమాట గుర్తు చేసుకుందాం… అంబేద్కర్ రాసిన “రాజ్యాంగంలో.. హక్కులే కాదు, అధికారమూ ఉంది”.. కానీ ఆ అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తూ.. మనల్ని మాత్రం ఆ హక్కుల కోసం రోడ్లపై కూర్చోబెడుతున్నారు. కానీ మనం రాజకీయ ఐక్యతతో, ఓటు హక్కుతో ఆ అధికారాన్ని సాధించుకుందాం.