కాళేశ్వరం తెలంగాణకే తలమానికం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కరీంనగర్ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోయర్ మానేరు డ్యాంను సందర్శించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు కేటీఆర్.
ఏటా వృథాగా పోతున్న వందల టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇది తెలంగాణ రాష్ట్రానికే తల మానికమని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగానే దేశానికే తెలంగాణ ధాన్య భాండాగారంగా మారిందని చెప్పారు కేటీఆర్. పంజాబ్, హర్యానాను తలదన్ని నీటి సమృద్ధిని సాధించటంతో వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు . మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో చూపి కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్ అని చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఎనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు కేటీఆర్. సరిగ్గా గతేడాది ఇదే రోజు ఎల్ఎండీలో 12 టీఎంసీలకు పైగా నీళ్లు ఉండేవని అన్నారు. పంపింగ్‌కు సరైన సమయంలో చేసి ఎల్ఎండీ పూర్తి కెపాసిటీని నింపి రైతులకు భరోసా ఇచ్చామన్నారు.
ఈ ఏడాది 45 శాతం వర్షపాతం తక్కువ నమోదైంది, కానీ ఇప్పటి వరకు పంపింగ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు.
మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృథా పోతుంటే ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు కేటీఆర్. అందుకే నీటి పంపింగ్‌పై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే తాము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలు దేరామని చెప్పారు కేటీఆర్. ఎండి పోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరుతున్నామన్నారు. రాజకీయ పరమైన కక్షతో పంపింగ్ స్టార్ట్ చేయక పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నెపల్లి దగ్గర పంప్ ఆన్ చేస్తే మొత్తం రిజర్వాయర్లు నిండుతాయని అన్నారు. మొత్తం రిజర్వాయర్లలో 140 టీఎంసీలకు గాను 35 టీఎంసీలు కూడా నిండ లేదన్నారు కేటీఆర్. మేడిగడ్డ నుంచి పెద్ద ఎత్తున నీటిని పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
మల్లన్న సాగర్‌లో 50 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్‌లో 15 టీఎంసీలు నింపితే ప్రజలకు మంచి నీటిని ఇబ్బందులు కూడా ఉండవన్నారు. కానీ ఇవన్నీ పక్కన బెట్టి కేసీఆర్ ను బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.