తెలంగాణ బడ్జెట్ బక్వాస్ – కేసీఆర్
ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటూ కామెంట్
హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై స్పందించారు . ఈ సందర్బంగా మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ మాట్లాడారు. ఇది రైతులను మోసం చేసిందని, అంతే కాదు అన్ని వర్గాల వారిని పట్టించు కోలేదని మండిపడ్డారు. ఎవరి కోసం బడ్జెట్ తయారు చేశారో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ చేశారు.
పేదలు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను పూర్తిగా ఈ బడ్జెట్ లో విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. సంక్షేమ పథకాల గురించి ఊసే లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకంపై పలు ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
దళిత బంధు ఏమైందని ప్రశ్నించారు. వారి పట్ల ఈ సర్కార్ కు ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థం అవుతుందంటూ ఎద్దేవా చేశారు. ప్రజల గొంతును ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. గొర్రెల పథకం అటకెక్కిందన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా బక్వాస్ అంటూ కొట్టి పారేశారు కేసీఆర్.
ఇది బడ్జెట్ లాగా లేదని కట్టు కథ లాగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి.