శ్వేత పత్రం కాదది ప్రచార పత్రం
ఏపీ కూటమి పాలన బక్వాస్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై విడుదల చేసిన శ్వేత పత్రంపై తీవ్రంగా స్పందించి వైసీపీ. గురువారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. వెయ్యి ఎలుకలను చంపి తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయిందన్నట్టుగా ఉందంటూ మండిపడింది. శాంతి భద్రతలు, గంజాయిపై వైట్ పేపర్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇచ్చిన హామీల అమలు దేవుడెరుగు ముందు రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితులు లేకుండా పోయాయని పేర్కొంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని వాపోయింది. తమ పాలన బాగుందంటూ గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని మండిపడింది.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ఇప్పుడు ఈ శ్వేత పత్రం విడుదల చేయడానికి మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేసింది వైసీపీ. 2014-19 మధ్య మీ హయాంలో దేశం లోనే ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యధికంగా జరిగిన టాప్ 10 రాష్ట్రాల జాబితాలో ఉందన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించింది.
తమ నాయకుడి పాలనలో నేరాలు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ చెప్పింది వాస్తవం కాదా అని నిలదీసింది వైసీపీ.