NEWSANDHRA PRADESH

ఆర్థిక శాఖపై సీఎం స్పెషల్​ ఫోకస్

Share it with your family & friends

26న శ్వేత ప‌త్రం విడుద‌ల

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భ‌లో ఆర్థిక శాఖ‌కు సంబంధించి కీల‌క‌మైన శ్వేత ప‌త్రం ఈనెల 26న శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందు తీసుకు వ‌స్తామ‌న్నారు.

గ‌త ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి అన్నారు. ఐదేళ్ల జగన్​ పాలనలో ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం 2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్​ఎమ్​ఎస్​లోకి అప్​లోడ్ చేయలేదన్న ప్రభుత్వం, 48 కోట్ల మేర బిల్లులు అప్​లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధారించింది.

నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్​లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19 వేల 324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19 వేల 549 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు వెల్లడించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14 వేల కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో 7 వేల 700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రేపు శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.