NEWSNATIONAL

కాన్షీరామ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి

Share it with your family & friends

డిమాండ్ చేసిన బీఎస్పీ చీఫ్ మాయావ‌తి

ఉత్త‌ర ప్ర‌దేశ్ – బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలు, మాజీ ముఖ్య‌మంత్రి కుమారి మాయ‌వ‌తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌కీయాల‌లో పెను మార్పుకు శ్రీ‌కారం చుట్టిన మాన్య‌వ‌ర్ దివంగ‌త కాన్షీ రామ్ కు బేష‌ర‌తుగా భార‌త ర‌త్న పుర‌స్కారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి పార్ల‌మెంట్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ కూడా ప్ర‌స్తావించ‌డాన్ని ఆమె స్వాగ‌తించారు.

కాన్షీ రామ్ వ్య‌క్తి కాదు వ్య‌వ‌స్థ అని పేర్కొన్నారు. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని తెలిపారు మాయావ‌తి. బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం ద్వారానే స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, ఆత్మ గౌర‌వం ల‌భిస్తుంద‌ని చెప్పిన ఏకైక నాయ‌కుడు కాన్షీ రామ్ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు మాజీ సీఎం.

పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు ఆశా దీపంగా నిలిచార‌ని, ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక పోయిన‌ప్ప‌టికీ ఇంకా బ‌తికే ఉన్నారంటూ గుర్తు చేశారు మాయావ‌తి. ఈ దేశంలో ఎంద‌రికో భార‌త ర‌త్న అవార్డుతో స‌త్క‌రించార‌ని, ఇదే స‌మ‌యంలో సద‌రు అవార్డుకు అక్ష‌రాలా వంద శాతం కాన్షీ రామ్ అర్హుడేన‌ని , వెంట‌నే బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు .