50 వేల మంది రైతులతో ప్రారంభిస్తాం
ప్రాజెక్టులతో నింపండి లేదంటే ఆందోళన
కరీంనగర్ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం జిల్లాలోని పలు ప్రాజెక్టులను పరిశీలించారు. గోదావరి జలాల్లో పూజలు చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో కావాలని తమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ ను బద్ నామ్ చేశారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
కాళేశ్వరం ప్రస్తుతం వస్తున్న వరద ధాటికి నిండు కుండను తలపింప చేస్తోందని చెప్పారు కేటీఆర్. అయితే కాళేశ్వరం నుంచి నీళ్లను ఎత్తి పోస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ భయాందోళనకు గురవుతోందని ఎద్దేవా చేశారు.
గతంలో కేసీఆర్ ను కావాలని దుష్ప్రచారం చేసిన వాళ్లంతా ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయారని, ఏ ఒక్కరు నోరు మెదపడం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరో తేలాలని అన్నారు. ఆగస్టు 2వ తేదీ నాటికి ప్రభుత్వం పంపులను ఆన్ చేసి ప్రాజెక్టులను నింపాలన్నారు. లేదంటే 50 వేల మంది రైతులతో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం పంపులను తామే ప్రారంభిస్తామని హెచ్చరించారు కేటీఆర్