NEWSTELANGANA

90 రోజుల్లో 30 వేల కొలువుల భ‌ర్తీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన 90 రోజుల లోపే ఏకంగా 30 వేల‌కు పైగా ప్ర‌భుత్వ జాబ్స్ ను భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఏడాది తిర‌గ‌క ముందే 60 వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్రక‌టించారు.

తాము ఇచ్చిన మాట ప్ర‌కారం త్వ‌రిత‌గ‌తిన భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని చెప్పారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.

డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్ల‌డించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం త‌మ బాధ్య‌త అన్నారు.

తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు. అంత‌కు ముందు గౌరవ వందనం స్వీకరించారు.

గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. వారిని అభినందించారు.

ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు.