బాధితుల ఆవేదన భువనేశ్వరి ఆలంబన
నాలుగు రోజుల పర్యటనలో 977 వినతులు
చిత్తూరు జిల్లా – కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి భారీ ఎత్తున బాధితులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ప్రధానంగా ఆమె నియోజకవర్గంలో పర్యటించిన నాలుగు రోజులలో ఏకంగా 977 వినతులు వచ్చాయి. వారందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు భువనేశ్వరి .
ఇందులో ఎక్కువ భాగం భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయని, వాటిపై ఫోకస్ పెడతామని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని భువనేశ్‌వరి హామీ ఇచ్చారు. ఈ టూర్ మొత్తం బిజీ బిజీగా గడిచింది.
పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి, కంచిబందార్లపల్లి, గుత్తార్లపల్లి, కోటపల్లి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను భువనేశ్వరి స్వీకరించారు. తొలిరోజు పర్యటనలో భువనేశ్వరికి 202 వినతులు వచ్చాయి.
రెండవ రోజు కుప్పం రూరల్ మండలం, ఎన్.కొత్తపల్లి, నడుమూరు, పైపాళ్యం, ఉర్ల ఓబనపల్లి, గుండ్ల నాయనపల్లి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. 310 వినతులు వచ్చాయి. మూడవ రోజు శాంతిపురం మండలం, సోమాపురం, కర్లగట్ట, బొడుగు మాకులపల్లి అదే విధంగా రామకుప్పం మండలం, ఆవుల కుప్పం, నారాయణపురం తండా, ఆరిమానిపెంట, వీర్నమల గ్రామాల్లో పర్యటించారు.
మూడవ రోజు పర్యటనలో 345 వినతిపత్రాలు వచ్చాయి. ఇక నాల్గవ రోజు కుప్పం టౌన్ లో పర్యటించారు. ప్రజలు తమ సమస్యలపై భువనేశ్వరికి వినతిపత్రాలు అందించారు. భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4రోజుల పర్యటనలో వచ్చిన వినతులతో కలిపి రమారమి 977 వినతులు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి, ప్రతి వినతిపత్రాన్ని సంబంధిత శాఖ అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి భువనేశ్వరి కోరనున్నారు.