DEVOTIONAL

భ‌క్తులకు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అందించాలి

Share it with your family & friends

ఇదే టీటీడీ అంతిమ ల‌క్ష్య‌మ‌న్న ఈవో శ్యామ‌ల రావు

తిరుమ‌ల – తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టిటిడి అంతిమ లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు ఈవో జె. శ్యామ‌ల రావు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆహార భద్రతా విభాగం అధికారులు టిటిడి అన్న ప్రసాదం సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. హోటళ్ల వ్యాపారులు, ఇతర వ్యాపారులు త్వరలో ఆహార భద్రతపై చర్యలు తీసుకుంటారని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు.

శుక్రవారం గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో సమక్షంలో ఫుడ్‌ సేఫ్టీ శాఖ అధికారులతో తిరుమలలోని పెద్ద, జనతా క్యాంటీన్‌లపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై సవివరమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను అందించారు,

ఇందులో తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు, తినుబండారాలలో అనుసరించాల్సిన పరిశుభ్రత , పారిశుద్ధ్య పద్ధతులు, ఆహారం చెడి పోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాల గురించి వివ‌రించారు. నిల్వ చేయడం, వృధా నిర్మూలన ప్రణాళిక, ఆహార భద్రత చట్టాలు, చట్టాలలో ఉల్లంఘన శిక్షలు, ఆహార వ్యాపార నిర్వాహకులకు, అనేక ఇతర వ్యక్తులకు చాలా అవసరమైన భారీ స్థాయి శిక్షణా కార్యక్రమం చేప‌ట్టారు.

ఈవో మాట్లాడుతూ ఆగస్ట్ 5 వరకు అన్ని పెద్ద , జనతా క్యాంటీన్ల నిర్వాహకులు తమ హోటల్ వాతావరణాన్ని ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం పునరుద్ధరించడానికి ఛాన్స్ ఇస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో అన్ని హోటల్‌లు తప్పకుండా వంటకాల ధరల జాబితాను ప్రదర్శించాలని స్ప‌ష్టం చేశారు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత, ఏదైనా హోటల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఆచ్చారు జె. శ్యామ‌ల రావు.

జేఈవో వీరబ్రహ్మం, డీఈవో హెల్త్‌ ఆశాజ్యోతి, అడిషనల్‌ హెచ్‌ఓ డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.