రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు
అంతలోపే గగ్గోలు పెడితే ఎలా..?
అమరావతి – ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై పదే పదే కామెంట్స్ చేస్తూ వస్తున్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పాలనా కాలంలో చేసిన తప్పుల గురించి ప్రస్తావిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు నారా లోకేష్.
రెడ్ బుక్ అంటే ఎందుకంత జగన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నాడో తనకు అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ ఉందని బహిరంగంగానే చెప్పానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.
తప్పు చేసిన వారందరి పేర్లు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. చట్ట ప్రకారం శిక్ష తప్పదని మరోసారి స్పష్టం చేస్తున్నానని చెప్పారు నారా లోకేష్. తాను ఇంకా పుస్తకాన్ని పూర్తిగా తెరవ లేదని స్పష్టం చేశారు. అంతలోపే ఏదో అయి పోయిందంటూ ఢిల్లీలో జగన్ రెడ్డి తన గురించి, రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు.
హత్యలు చేయించే వాళ్లకు ప్రజల ఇబ్బందులు ఏం తెలుస్తాయని మండిపడ్డారు నారా లోకేష్. ప్రస్తుతం లోకేష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.