ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే తప్పేంటి
కావాలనే ఇవ్వడం లేదన్న జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏపీ శాసన సభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో పాటు కూటమి సర్కార్ ను, ప్రత్యేకించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నర్మ గర్భంగా కామెంట్స్ చేశారు.
శుక్రవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సభలో ప్రశ్నిస్తానని, వారు చేస్తున్న ఆగడాలను నిలదీస్తానని భయంతోనే గుర్తించడం లేదంటూ మండిపడ్డారు. ఇదేనా ప్రజా స్వామ్యం అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే తనకు మైక్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే తన పట్ల వివక్షను చూపుతున్నారంటూ ఆరోపించారు. దీనిని సవాల్ చేస్తూ, ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి కోర్టు మంగళవారానికి వాయిదా వేసిందని తెలిపారు. ఆరు నూరైనా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని, ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటానని ప్రకటించారు. కూటమి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.