NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ నిర్వాకం మ‌ద్యం కుంభ‌కోణం

Share it with your family & friends

విచార‌ణ జ‌రిపిస్తామ‌న్న కొల్లు ర‌వీంద్ర‌

అమరావతి : జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్రంలోని మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయట పెడతామని గనులు, భూగర్బ‌, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్ర‌వారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్ల పాలనలో మద్యం డిస్టిలరీల కేటాయింపు నుండి అమ్మకాల వరకు అనేక చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.

మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే శ్వేత పత్రం ద్వారా బయట పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు మంత్రి. మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని వారి నెత్తిన రుద్దారన్నారు. అందుబాటులో ఉన్న బ్రాండ్లను తొలగించి పిచ్చి బ్రాండ్లు తెచ్చారని ఆరోపించారు. వాటిని తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. కిడ్నీ, లివర్ సమస్యలతో వేలాది మంది ఆస్పత్రుల్లో చేరారని తెలిపారు.

మరో వైపు బీరు అమ్మకాలను సైతం దెబ్బ తీశారన్నారు. యునైటెడ్ బేవరేజెస్, హరిక్లోస్ బేవరీస్, ఎస్ఆర్‌జే బేవరేజెస్ లాంటి సంస్థ‌ల‌ను పూర్తిగా మూయించార‌ని ఆరోపించారు మంత్రి . బీరు ధరల్ని పెంచి, అమ్మకాలను తగ్గించారని మండిప‌డ్డారు కొల్లు ర‌వీంద్ర‌. అదే సమయంలో గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చి యువత జీవితాలను ఛిద్రం చేశారని వాపోయారు.