మహిళాల ఆసియా కప్ ఫైనల్ కు భారత్
బంగ్లాదేశ్ జట్టుపై 10 వికెట్ల తేడాతో గెలుపు
శ్రీలంక – శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో ఫైనల్ కు చేరుకుంది భారత మహిళా క్రికెట్ జట్టు . తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టును ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాను కేవలం 80 పరుగులకే కట్టడి చేసింది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో మైదానంలోకి దిగిన భారత మహిళా టీమ్ ఎక్కడా తల వంచ లేదు. ఆడుతూ పాడుతూ టార్గెట్ ను ఛేదించారు. వికెట్ కోల్పోకుండానే పని కానిచ్చేశారు. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతీ మంధానాలు కలిసి ఒకటో వికెట్ భాగస్వామ్యానికి 81 పరుగులను జోడించారు. తమ జట్టుకు అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టారు.
అంతకు ముందు భారత మహిళా జట్టు బౌలర్లు రాధా యాదవ్ , రేణుకా సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఎక్కడా పరుగులు తీయనీయ కుండా అడ్డుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి బంగ్లా 80 రన్స్ చేసింది.
ఇక జట్ల పరంగా చూస్తే భారత జట్టులో షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్ ), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ ఉన్నారు.
బంగ్లా దేశ్ జట్టులో దిలారా అక్టర్, ముర్షిదా ఖాతున్, నిగర్ సుల్తానా (వికెట్ కీపర్ ), రుమానా అహ్మద్, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబెయా ఖాన్, షోర్నా అక్టర్, నహిదా అక్టర్, జహనారా ఆలం, మారుఫా అక్టర్ ఆడారు.