DEVOTIONAL

భ‌క్తుల సౌక‌ర్యాల‌పై ఈవో ఆరా

Share it with your family & friends

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త‌నిఖీ

తిరుమల – వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో టీటీడీ భక్తులకు అందిస్తున్న వ‌స‌తి సౌకర్యాలను ఈవో జె. శ్యామలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో భక్తులకు అందుతున్న అన్న ప్రసాదాలు, తాగు నీరు, శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం, కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య చర్యలు, పెద్ద స్క్రీన్ లలో ప్రసారం అవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు, వివిధ భాషలలో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అంతకు ముందు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు.

ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈవో. ఇందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో టికెట్లు జారీ చేసే కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తరువాత ఈవో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను, తిరుమల నంబి ఆలయం, బయోమెట్రిక్ ను పరిశీలించారు.ఈవో వెంట జేఈవో వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, ఎస్ ఇ -2 శ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో లోకనాథం, ఎలక్ట్రికల్ డిఈ శ్రీరవిశంకర్ రెడ్డి, విజిఓ నందకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు.