జగన్ మోడీకి బిడ్డ లాంటోడు
ప్రధానినే ధర్నా చేయించారు
చిత్తూరు జిల్లా – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రెండు కుటుంబాల కారణంగానే రాష్ట్రం విడి పోయిందని ఆరోపించారు.
ఇదే సమయంలో జగన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బిడ్డ లాంటోడని అన్నారు. పీఎం చెబితేనే జగన్ ఢిల్లీలో ధర్నా చేశాడని మండిపడ్డారు. జగన్ దేని కోసం ఆందోళన చేశారో చెప్పాలని, ఓడి పోయినందుకు, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసినందుకు చేశారా అని ప్రశ్నించారు చింతా మోహన్.
ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల మైలేజ్ రాక పోగా ఉన్న పరువు పోయిందన్నారు. పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి బాబును కొట్టాడని జగన్ చెప్పడాన్ని ఖండించారు. ఇద్దరూ చదుకునే రోజుల్లో చెరో గ్రూప్ కు నాయకత్వం వహించారని చింతా మోహన్ చెప్పారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ అడిగినందుకు అధికారంలోకి కూర్చో బెట్టారని, కానీ తను దానిని సద్వినియోగం చేసుకోలేక పోయారని అన్నారు. జగన్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ, కార్పొరేషన్, ఓబిసి కార్పొరేషన్ నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు.
నిర్వీర్యమై పోయిన ఈ సంస్థలకు టీడీపీ సర్కార్ నిధులు ఇస్తుందా అని ప్రశ్నించారు . కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ కార్పొరేషన్లు కు నిధులు ఇచ్చారని ఇక్కడ దాని ఊసెత్తడం లేదన్నారు. ఏపీ అప్పుల గురించి చెరో రకంగా చెబుతున్నారని, ఇంతకు ఎవరి మాట నమ్మాలో గవర్నర్ చెప్పాలన్నారు. నిజాలు తెలియాలంటే నిజ నిర్దారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.