పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్
బాధితులకు డిప్యూటీ సీఎం భరోసా
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా దర్బార్ కు జనం పోటెత్తారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పలువురు వినతిపత్రాలు సమర్పించారు. అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం.
వెంకటగిరిలో మహిళలను, వృద్ధులను వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించారు. తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్. వెంటనే కేసులు నమోదు చేసి బైండోవర్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తానే స్వయంగా ఆర్జీలను తీసుకున్నారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ కు విన్నవించారు.
ఎన్నికల సందర్బంగా ప్రజలకు హామీ ఇచ్చారు. తాను ప్రజలతోనే కలిసి ఉంటానని, ప్రజా దర్బార్ చేపడతానని ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం ప్రజా దర్బార్ కొనసాగుతోంది.