చంద్రబాబు..లోకేష్ కు పవన్ ప్రశంస
స్పూర్తి ప్రదాతల పేర్లతో పథకాలు హర్షణీయం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి జగన్ పేరు ఉండదని ప్రకటించారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇదే సమయంలో స్పూర్తి దాయకమైన వ్యక్తులు, ప్రముఖుల పేర్లను వాటికి పెడతామని , ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
అద్భుతమైన ఆలోచన అని, చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను ఈ సందర్బంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం మంచిదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు జగన్ మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి మంగళం పాడటమే కాకుండా విద్యార్థులలో స్పూర్తిని కలిగించే వారి పేర్లు పెట్టడం భేష్ అని కొనియాడారు.