బోనం ఎత్తిన భట్టి విక్రమార్క
బోనాల ఉత్సవాలలో కుటుంబం
హైదరాబాద్ – ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మ వారి లాల్ దర్వాజా ఆలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మ వారికి పట్టు వస్తాలను సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులు కూడా పట్టు వస్త్రాలు అమ్మ వారికి అందజేశారు.
డిప్యూటీ సీఎం, మంత్రి కుటుంబీకులకు మహంకాళి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికింది. భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఉత్సవాలలో భాగంగా మహంకాళి అమ్మ వారికి బోనం సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సతీమణి మల్లు నందిని .
ఈ సందర్బంగా మహంకాళి ఆలయం వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు ఘనంగా స్వాగతం పలికారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, ఆలయ కమిటీ నిర్వాహకులు.
అమ్మ వారికి బోనం సమర్పించిన అనంతరం చార్మినార్ లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు.